Sunday, February 05, 2017

నిరుపేద బాలలకు విద్యాగంధం
గిరిజన విద్యార్థుల భవితకు బంగారు బాటలు
నేడు ఏకలవ్య ఆశ్రమం - సేవాభారతి రజతోత్సవం
నిరుపేద బాలలు.. తల్లిదండ్రులు లేని వారిని గుండెలకు హత్తుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది మంచిర్యాల పట్టణంలోని ఏకలవ్య ఆశ్రమం. నేటి సమాజంలో మనకు సంబంధంలేని వ్యక్తుల గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. ఒకానొక సందర్భంలో మన దగ్గరి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆదుకునేందుకు వెనుకా ముందు ఆలోచిస్తుంటాం. అలాంటిది గత కొన్నేళ్లుగా నిరుపేదలు, తల్లిదండ్రులులేని అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు. సేవే లక్ష్యం.. ప్రేమే మార్గం.. స్ఫూర్తితో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. చక్కటి క్రమశిక్షణతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభ్వుత కొలువులే కాకుండా కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి సంస్థ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఇంతమంది జీవితాలకు వెలుగునిస్తున్న ఆ సంస్థ పేరే ఏకలవ్య ఆశ్రమం- సేవాభారతి. ఆశ్రమం ఏర్పాటుచేసి ఇరవై ఐదేళ్లు (25) పూర్తయిన సందర్భంగా ఆదివారం రజతోత్సవం జరుపుకొంటోంది.
ఏసీసీ, న్యూస్‌టుడే
తొంభయ్యవ దశకంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన కాశెట్టి లక్ష్మణ్‌ జిల్లాలోని పలు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతుండగా అనేకమంది బాలలు చదువుకోకుండా వివిధ రకాల పనులు చేస్తూ కనిపించారు. విద్యకు దూరమవుతున్న ఆ చిన్నారులకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నారు. మిత్రులైన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గర్మిళ్ల విఠల్‌లతో తన ఆలోచనను పంచుకొని వారి సాయంతో స్థానిక శిశుమందిర్‌ పాఠశాల ఆవరణలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. నిరుపేదలు, తల్లిదండ్రులు లేని గిరిజన కుటుంబాలకు చెందిన ఏడుగురు చిన్నారులకు ఆశ్రయం కల్పించారు. పాఠశాలలో విద్య అందించడంతో పాటు క్రమశిక్షణ నేర్పి నేటి సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. కమిటీని ఏర్పాటుచేసి ఆశ్రమ బాధ్యతను అప్పగించారు. 1992లో ఆశ్రమానికి ఏకలవ్య ఆశ్రమం - సేవాభారతి అనే పేరుతో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. మరింత ఎక్కువ మంది గిరిజన విద్యార్థులకు ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో సొంత భవన నిర్మాణానికి స్థల సేకరణ చేయగా కొల్లూరి రామయ్య తన కుమారుడి జ్ఞాపకార్థం 26 గుంటల భూమిని విరాళంగా అందజేశారు. అలాగే మంచిర్యాలకు చెందిన పలువురు దాతల సహకారంతో మరో 20 గుంటల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి శ్రీరాంపూర్‌ గని నిర్వాహణాధికారి మాలిక్‌ తాత్కాలింగా మూడు గదులు ఏర్పాటు చేసి విద్యార్థులకు తోడ్పాటు అందించారు. ఓ మంచి పని కోసం ఆశ్రమ నిర్వాహకులు పడుతున్న తాపత్రయాన్ని చూసి క్రమంగా దాతలు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. మూడు అంతస్థుల భవనం నిర్మించేందుకు చేయూత అందించారు. నేడు పదుల సంఖ్యలో అనాథలు, నిరుపేద విద్యార్థులకు నిలయంగా మారింది. రెండో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆశ్రమంలో విద్యార్థులకు అవకాశం ఉండగా.. చదువుకోవాలనే తపన ఉండే విద్యార్థులకు మరింత ఉన్నతచదువులకు చేయూతనందిస్తున్నారు.

ఆశ్రమం ఏర్పాటుచేసిన నాటి నుంచి ప్రతి మూడేళ్లకు నూతన కమిటీని ప్రకటించి నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూస్తున్నారు. దాదాపు 30 మంది సభ్యులున్న కమిటీలో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మరో ఏడుగురు ఆశ్రమం బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. ఆశ్రమం పేరిట బ్యాంకు ఖాతా తీసి దాతలు అందించిన విరాళాలను అందులో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఎవరైనా సహాయసహకారాలు అందించవచ్చు
ప్రస్తుతం ఆశ్రమంలో 32 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. పూర్తి దాతల సహకారంతో నడుస్తున్న సంస్థకు ఎవరైనా సహకారం అందించవచ్చు. అన్నదానం, విద్యార్థుల పేరిట సహాయం, వస్తువులను కూడా ఇవ్వవచ్చు. దానం చేసే ప్రతి అంశాన్ని రికార్డుల రూపంలో భద్రపరుస్తారు.

దాతల సహకారంతోనే ఈ స్థాయికి..
- దామెర రాజయ్య, ఆశ్రమం అధ్యక్షుడు, మంచిర్యాల
ఏకలవ్య ఆశ్రమం ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుందంటే దాతల సహకారమే కారణం. విద్యకు దూరమవుతున్న గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆశ్రమం భవిష్యత్తులో మరింతమంది చిన్నారులకు ఆశ్రయం కల్పించి బంగారుబాట వేసేలా కృషి చేస్తాం. రజతోత్సవాలకు పూర్వవిద్యార్థులు కూడా హాజరుకానుండటం సంతోషంగా ఉంది. ఇటువంటి సేవా సంస్థకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుండటం చాలా సంతోషంగా ఉంది.

ఆశ్రమంలో అన్ని రంగాల్లో శిక్షణ
- ఆనందరావు, కార్యదర్శి, మంచిర్యాల
విద్య అందిస్తేనే విద్యార్థి ఉన్నతంగా ఎదుగుతాడని అనడం సరైంది కాదు. ఇదే ఉద్దేశంతో విద్యతో పాటు సమాజంపై అవగాహన, దేశభక్తి, క్రమశిక్షణ, వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నాం. మా విద్యార్థి వ్యవహారశైలిని చూస్తే చాలు అతను ఏకలవ్య ఆశ్రమ వాసి అని. 25 ఏళ్లలో ఎంతో మందికి విద్యను అందించడమే కాకుండా ఉన్నతంగా ఎదిగేందుకు ఆశ్రమం దోహదపడింది. ఈ వేడుకలో నేను భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది.

చదువులో ముందుంటున్నా
- అర్జున్‌, ప్రస్తుత విద్యార్థి
చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ ఆశ్రమంలో చేరాను. అంతకుముందు ఆర్థిక పరిస్థితి బాగోలేక చదువుపై శ్రద్ధ చూపలేకపోయాను. 5వ తరగతిలో ఆశ్రమంలో చేరి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు వివిధ రంగాల్లో రాణిస్తున్నా. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి నాలాంటి వారికి సేవచేస్తా.

ఆశ్రమానికి రుణపడి ఉంటా
- నారాయణ, పూర్వ విద్యార్థి, వేమనపల్లి
నిరుపేదనైన నేను ఆశ్రమానికి వచ్చి 1993లో మొదటి తరగతిలో చేరా. పదో తరగతి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదివి మొదటిశ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. వారి ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివగలిగాను. ప్రస్తుతం ఎమ్మెల్సీ డీఎడ్‌ పూర్తిచేసి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయునిగా విధులు నిర్వరిస్తున్నా. ప్రభుత్వ కొలువు సాధనకు ప్రయత్నిస్తున్నా. ఈ స్థాయికి చేరానంటే ఏకలవ్య ఆశ్రమమే కారణం. ఆశ్రమానికి రుణపడి ఉంటా.

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.