Tuesday, February 14, 2017

తాజా వార్తలు

అవకాశాలు అందిపుచ్చుకోవాలి
ఎక్సఎల్‌ఆర్‌8 హెడ్‌ గ్లెన్‌ ఇ రాబిన్‌సన్‌
మంగళం(తిరుపతి), న్యూస్‌టుడే: అవకాశాలను అందిపుచ్చుకొని విస్తృతం చేసుకోవడంతో పాటు విపణి పరిధిని పెంచుకుంటేనే పారిశ్రామికవేత్తలు రాణించగలరని ఏపీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8 హెడ్‌ గ్లెన్‌ ఇ రాబిన్‌సన్‌ పిలుపునిచ్చారు. నగర సమీపంలోని ఏపీ ఇన్నోవేషన్‌ కేంద్రం నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎక్స్‌ఎల్‌ఆర్‌8 సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రెండో ఔత్సాహిక వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 33 మంది ఔత్సాహిక వ్యవస్థాపకులు, సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లెన్‌ ఇ రాబిన్‌సన్‌ మాట్లాడుతూ.. సంస్థల ఉత్పత్తులను పెంచుకొని, విపణిని విస్తృత పర్చడం ద్వారా ఉద్యోగావకాశాలు పెంచేందుకు ఈ శిక్షణ దోహద పడుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక శిక్షణ ద్వారా భవిష్యత్తులో ఎన్నో సంస్థల, పరిశ్రమల వ్యవస్థాపనకు, విపణి పరిధి పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏపీ ఇన్నోవేషన్‌ సంస్థ మేనేజర్‌ గీతాశ్రీ మాట్లాడుతూ.. సంస్థ మొదటి బ్యాచ్‌ నుంచి 9 సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో అనేక మంది తిరుపతిలోనే తమ సంస్థలను పెట్టేందుకు ముందుకొచ్చారని గుర్తుచేశారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శిక్షణకు హాజరైన పారిశ్రామికవేత్తలకు నాలుగు నెలలపాటు శిక్షణనిచ్చి.. వీరిలో నైపుణ్యం ఉండి, ప్రజల అవసరాలకు ఉపయోగపడి, ఉద్యోగాలు సృష్టించే వీలున్న సంస్థల ప్రతినిధులకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.