Sunday, July 16, 2017

ప్రత్యేక కథనాలు

మలి సంధ్యలో వేకువ కిరణం!
ఆటపాటలతో వృద్ధులకు ఆరోగ్యం పంచుతున్న వేదికలు
మలి వయసులో నూతనోత్తేజానికి మార్గాలు
జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే
ఆయనకు దాదాపు 60 ఏళ్లు. చేతికర్ర లేందే అడుగు వేయలేరు. ఇష్టపడి కేబీఆర్‌ ఉద్యానవనానికి చేరుకున్నారు. కర్ర పక్కనపడేసి అప్పటికే అక్కడున్న వృద్ధులు, యువకులతో ఆడారు.. పాడారు. యోగా చేశారు. కథా కాలక్షేపం చేశారు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని తనకు తెలిసిన విషయాలు పంచుకున్నారు. ఆయన్ను చూసి ఆ మార్గంలో వెళ్లే పిల్లాపెద్దలూ వచ్చారు. ఈ సామూహిక చైతన్య కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పదుల సంఖ్యలో వృద్ధులు వయసును పక్కనపెట్టి చేస్తున్న ఈ వినూత్న కార్యక్రమం కేబీఆర్‌ ఉద్యానంలో ఆకట్టుకుంటోంది. మలి వయసులో వేకువ కిరణాల వెచ్చని స్పర్శతో నూతన జవసత్వాలు ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ఇది. ఇక్కడ కలిసే పెద్దలంతా ‘ఆరోగ్య’కరమైన వాతావరణంలో ఆత్మవిశ్వాసం నింపుకొని సరికొత్త జీవితం వైపు నడుస్తున్నారు.

‘ఒక వయసొచ్చాక.. ఇంట్లో ఓ మూలకు కృష్ణ.. రామా అంటూ కూర్చోవచ్చు కదా..!’ చాలా మంది పెద్దవారు ఉన్న ఇళ్లలో సర్వసాధారణంగా వినిపించే మాటలివి. పల్లెల్లో ఉండి నలుగురితో నిత్యం మాట్లాడి, నలుగురిలోనే పొద్దు పోయే వరకు సరదాగా గడిపే పెద్దవాళ్లు చాలా మంది ఉంటారు. కాని నగర జీవన విధానంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి. సరైన ఆరోగ్యం, ఆహారం లేక ఒంటరిగా భావిస్తుంటారు. ఒంటరితనం కారణంగా చిన్న సమస్యలే మానసిక సమస్యలుగా మారుతాయంటున్నారు నగర వైద్యులు. ఇంటిపట్టునే ఉండటం ఇంకా ప్రమాదకరమని అంటున్నారు. వారిలో వ్యాయామం కరవై, పనులు చేసుకోలేక, ఆత్మవిశ్వాసం లేమితో బాధపడుతుంటారని డాక్టర్‌ ప్రసాద్‌ మువ్వ అంటున్నారు. ఇలాంటి బాధల నుంచి బయటపడేందుకు పార్కుల్లో వృద్ధులంతా కలుసుకోవడం అప్పుడప్పుడు పార్కుల్లో కనిపిస్తుంది. శ్రీనగర్‌కాలనీలో జీహెచ్‌ఎంసీ పార్కుకొచ్చే వారూ ఇలా ప్రతి రోజు కలుసుకొంటారు.

శని, ఆదివారాల్లో మాత్రమే..
పిల్లలు ఉద్యోగాలకు, మనవళ్లు పాఠశాలలకు వెళ్లగా ఇంట్లో పెద్దలు మాత్రమే ఒంటరిగా మిగులుతారు. ఇలాంటి వారిలో ఆరోగ్య స్పృహ కలిగించేందుకు, అవకాశాన్ని కల్పించేందుకు నగరానికి చెందిన అన్వయ.కామ్‌ అనే సంస్థ వినూత్నమైన ఆలోచన చేసింది. వృద్ధులందరినీ ఒకచోటికి చేర్చి వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు యత్నిస్తోంది. కేవలం శని, ఆదివారం ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసేలా ప్రణాళిక రూపొందించింది. తమ మొదటి ప్రయోగాన్ని బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ వద్ద ప్రారంభించింది. వూహించని విధంగా వందలాది మంది వృద్ధులు వస్తున్నారు. ఉదయం రెండు గంటలపాటు సమయాన్ని ఇందుకు కేటాయించడమే కాదు.. అందులో ఆనందాన్ని పొందుతున్నారు. ఇక చాలా మంది పెద్దలు వూరికూరికే తూలి పడిపోతుంటారు. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవచ్చనే అంశాలను డాక్టర్‌ అంజలి అగర్వాల్‌లాంటి వైద్యులు వివరిస్తున్నారు.

ప్రతి వారం ప్రత్యేక కార్యక్రమం
వృద్ధుల్లో కనిపించేవి ఆరోగ్య సమస్యలు, ఆహార సమస్యలు. ఆరోగ్యాన్ని తమ చేతుల్లో తాము ఎలా ఉంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలనే విషయాలను ఇక్కడ ఈ వారాంతపు కార్యక్రమాల ద్వారా ఉచితంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అన్వయ సంస్థ నిర్వాహకులు. ఫిట్‌నెస్‌ నిపుణులు దినాజ్‌లాంటి వారితో ఫిట్‌నెస్‌ పాఠాలు, డాక్టర్‌ మణిపవిత్ర యార్లగడ్డతో యోగా కూడా నేర్పిస్తున్నట్లు ‘అన్వయ’ నిర్వాహకులు ప్రశాంత్‌రెడ్డి చెబుతున్నారు. ఆగస్టు 6 వరకు ప్రతి శని, ఆదివారాలు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

కథలతో ఆత్మవిశ్వాసం
చాలా మంది వృద్ధులకు కాలక్షేపం కావాలి. ఇందుకోసం చాలా యువ నాటిక సంస్థలు మందుకొస్తున్నాయి. నిషుంబితలాంటి యువ సంస్థలు ఇక్కడికొచ్చి నాటక రూపంలో ధైర్యం ఆత్మవిశ్వాసంఇస్తున్నాయి. స్వతంత్రంగా ఉండటమే కాకుండా ఎవరి సాయం తీసుకోకుండా తమ జీవితాన్ని ఎలా ధైర్యంగా నెగ్గవచ్చో చెపుతున్నారు. చాలా మంది పిల్లలు అమెరికాకు వెళ్తారు, లేదా ఉద్యోగాలలో పడుతారు అప్పుడు వృద్ధులు తమలో తాము ఎలా ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలో కథారూపంలో చెబుతారు. ఈ కార్యక్రమాలు ఇక్కడికొచ్చే వృద్ధుల్లో ఆసక్తి నింపడమే కాకుండా వారిని కొత్త జీవితం వైపు నడిపిస్తున్నాయి. అంతా కలిసి ఇలాంటి కథలను, నాటికలను చూడటం ద్వారా తమకు తాముగా ఉత్తేజం పొందుతున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా నయా జీవితం వైపు నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

ఆరోగ్యాన్ని ‘తోడు’గా ఉంచుకోవాలి
- జనార్దన్‌రెడ్డి, కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ
ఒక వయసు వచ్చాక ప్రతి ఒక్కరికీ తోడు కావాలి. వృద్ధుల్లో కావాల్సింది ఒంటరితనాన్ని జయించడం. అందుకోసం సమయాన్ని కేటాయించుకొని కాలక్షేపం చేయాలి. మలివయసులో మంచి ఆరోగ్యాన్ని తోడుగా ఉంచుకోవాలి. అప్పుడే వయసు మళ్లిన వారికి అది శ్రీరామరక్షగా నిలుస్తుంది. చాలా మంది వయోవృద్ధులు ఇతరుల మీద ఆధారపడకుండా తమను తాము కాపాడుకొనేందుకు, తీర్చిదిద్దుకొనేందుకు ఇలాంటి యోగా, ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నియమాలను పాటించాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.