close

Friday, September 29, 2017

తాజా వార్తలు

సృజనాత్మకతతోనే యువత ప్రగతి
మంగళం(తిరుపతి), న్యూస్‌టుడే: సంప్రదాయ వ్యాపార పద్ధతులకు సాంకేతిక అంశాలను జోడించి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాలని విదేశీ సాంకేతిక నిపుణులు డాక్టర్‌ నార్మన్‌ కదర్‌లాన్‌, డాక్టర్‌ స్టీవ్‌ నికోల్స్‌ సూచించారు. తిరుపతి నగర సమీపంలోని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8 శిక్షణ కేంద్రంలో ‘సైంటిస్ట్‌ రోల్‌ ఇన్‌ టెక్నాలజీ కమర్షిలైజేషన్‌’ అనే అంశంపై మూడురోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గురువారం నాటి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక రాజధానిగా చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్నింటా ప్రథమమంగా నిలపడంతోపాటు, వ్యక్తిగత ఆదాయం పెంచి, తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించగలిగేలా మార్పులు తీసుకు వచ్చేందుకు సీఎం కష్టపడుతున్నారని అన్నారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా పంటలు పండించే రైతులు, నిపుణులైన వ్యాపారవేత్తలు, సత్తాఉన్న యువతపైనే ఆధారపడి ఉంటాయన్నారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు తమదేశ మూలాలపై పరిశోధనలు జరపాలన్నారు. దేశానికి వెన్నెముకగా నిలిచే ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. ఏదేశంలోనైనా ఏళ్లుగా సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటాయని.. వీటిని మెరుగు పరుచుకుంటే వ్యాపారంలో వేగాన్ని పెంచవచ్చని చెప్పారు. సాంకేతికంగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులను భారత్‌లో ఇప్పుడిప్పుడే అమలు చేస్తున్నారని.. అయితే భారతదేశ వ్యాపార నైపుణ్యాలు వందల ఏళ్ల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడి నైపుణ్యాలకు విదేశాల్లో సాంకేతికతను జతచేసి మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. ప్రతి దేశానికీ యువతే ఆదాయ వనరని.. ఉత్సాహవంతులై సృజనాత్మకత, నైపుణ్యాలు కలిగిన యువతే దేశాన్ని, దేశ పరిస్థితులను శాసిస్తారని అన్నారు. కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రస్తుతం చదువుతున్న యువకుల్లోని సృజనాత్మకతను గుర్తించి పదును పెడితే ఆదాయవనరుల సృష్టి, ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్నారు. సృజనాత్మకతతో కూడిన ఒక్క ఆలోచన జీవిత గమ్యాన్ని మార్చేస్తుందని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుపుతుందన్నారు. ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ మేనేజర్‌ గీత మాట్లాడుతూ వివిధ దేశాల్లో వ్యాపారాభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, విజయవంతంగా అమలు చేయడంలో నార్మన్‌, స్టీవ్‌ల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. వీరి అనుభవాలను నేటి తరం వ్యాపావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులకు తెలియజేసి శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో ఏపీ ఎక్స్‌ఎల్‌ఆర్‌8కు తీసుకువచ్చినట్లు తెలిపారు. వీరి వ్యాపార సూత్రాలు సూచనలు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఎక్స్‌ఎల్‌ఆర్‌8 ఎండీ గ్లెన్‌రాబిన్‌సన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.